AP News | అనంతపురం జిల్లాలోని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వసతీగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి కలకలం రేపుతోంది. హాస్టల్లో రాత్రి నిద్రపోతున్న సమయంలో 10 విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా కాలేజీ ప్రిన్సిపాల్ సీక్రెట్‌గా ఉంచారు. అయితే ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లాలో ఒకే ఒక్క ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఉంది. అదే కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ. ఇందులో దాదాపు 1200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరిలో 400 మంది ఒకే హాస్టల్లో ఉంటున్నారు. కానీ ఈ కాలేజీ, హాస్టల్ నిర్వహణ లోపాలున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో గదుల్లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. కాగా, విద్యార్థినులు బయట నుంచి స్నాక్స్ తీసుకొస్తుండటంతోనే ఎలుకలు వస్తున్నాయని కాలేజీ ప్రిన్సిపల్ సత్యలత, వార్డెన్ సౌగంధిక తెలిపారు. ఎలుకల బెడదను నివారించేందుకు హాస్టల్ రూమ్‌లు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది.