YS Jagan | నెల్లూరులో పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. చంద్రబాబు బావిలో దూకడం కాదు.. నువ్వు నీళ్లు లేని బావిలో పడ్డా.. నువ్వు చేసిన పాపాలు పోవంటూ విమర్శించారు. నువ్వు చేసిన అక్రమాలకు తొందరలోనే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.. సూట్కేసు రెడీ చేసుకో అంటూ సూచించారు.
రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. అర్హులైన వారికి పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం.. సీఎం చంద్రబాబు మీద జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రకాశ్ రెడ్డికి నిద్రలో కూడా పరిటాల రవినే గుర్తొస్తున్నారని విమర్శించారు. ఆయన చనిపోయి ఇరవై ఏండ్లు అవుతుందని.. ఇంకా ఆయనంటే మీకు భయం పోలేదా అని ఎద్దేవా చేశారు. పరిటాల రవి పేరు ఉచ్ఛరించకుండా ప్రకాశ్ రెడ్డి సమావేశాలే ఉండటం లేదని విమర్శించారు.
పరిటాల రవి హత్యలు చేసి ఉంటే గత ఐదేళ్లలో ఎందుకు నిరూపించలేకపోయావని ప్రకాశ్ రెడ్డిని సునీత ప్రశ్నించారు. నిత్యం ఇలాంటి అబద్ధాలతో కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నావని మండిపడ్డారు. చిన్న కేసు ఉంటేనే అడ్రస్ లేకుండా పోతావు.. నెలకు ఒకసారి వచ్చి కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడతావమని మండిపడ్డారు. ఈ 45 రోజులు ఎక్కడ దాక్కున్నావని నిలదీశారు. పరిటాల రవి కుటుంబం గురించి మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.