R.Krishnaiah | వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీ మారడంపై ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పందించారు. పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని తెలిపారు. వాళ్లలా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ తనను ఆదరించి, గౌరవించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. అందుకే మొదటి నుంచి అతనికి మద్దతుగానే ఉన్నానని.. ఎప్పటికీ ఉంటానని తెలిపారు. బీసీల కోసం కొట్లాడమనే తనను జగన్ రాజ్యసభకు పంపించారని అన్నారు. బీసీల అభ్యున్నతే తన అజెండా అని తెలిపారు. చివరి వరకు వైసీపీలోనే ఉండి.. బీసీల కోసం పోరాడతానని పేర్కొన్నారు. స్వప్రయోజనాలు, వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే చాలామంది వేరే పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. వాళ్లలా ప్రలోభాలకు లొంగి పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. వాళ్లకు కూడా పార్టీ మారొద్దనే చెప్పా.. కానీ వినలేదని అన్నారు. తన బీసీ సంఘమే తనకు ఒక పార్టీ అంతా అని చెప్పారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో.. 14 మంది పార్టీ మారినా తాను మాత్రం మారలేదని గుర్తుచేశారు. బీసీల కోసం మరింత ఉధృతంగా పోరాడతానని తెలిపారు.
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తమ పదవులకు గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్కు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… తమకు ఇంకా పదవికాలం ఉన్నాగాని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా వ్యక్తిగత కారణాలతో పదవులకు, వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని తెలిపారు. తమకు పదవులు కల్పించినందుకుగాను వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరాలన్నది కుటుంబ సభ్యులు, ముఖ్యనాయకులు, అనుచరులతోకలిసి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తామని, తాను గతంలో 32 సంవత్సరాల పాటు టీడీపీలో పనిచేశానని, తనకు చంద్రబాబు బాస్లాంటి వారని పేర్కొన్నారు.