Adireddy Vasu | వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.. అసెంబ్లీకి రావాలి జగన్.. కావాలి జగన్ అన్నదే తమ నినాదమని తెలిపారు.
రాజకీయ హత్యలు అంటూ చేస్తున్న ఆరోపణలపై అసెంబ్లీకి వచ్చి కనీస వివరణ ఇవ్వకుండా జగన్ ఢిల్లీ వెళ్లి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు. చూస్తుంటే జగన్కు చిన్న మెదడు కూడా పోయిందని అనిపిస్తుందని విమర్శించారు. అసెంబ్లీకి జగన్ వస్తేనే బాగుంటుందని అన్నారు. కేసులు ఎంతమంది మీద ఉన్నాయని గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు అడిగితే ఎమ్మెల్యేల కళ్లన్నీ కూడా జగన్ రాక కోసమే ఎదురుచూస్తున్నాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి జగన్ రావాలన్నదే తమ నినాదమని చెప్పారు. .
నేర, గంజాయి రాజధానిగా మారిన ఏపీ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు వైసీపీ బిస్కెట్లకు ఆశపడి తనను పార్టీ మారాలని ఒత్తిడి చేశారని బయటపెట్టారు.