ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభ వార్త. మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వర్షం పడాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కదులుతున్నాయి. దాంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు రుతుపవనాలు ఇప్పటికే నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కర్ణాటక, కొంకణ్, గోవా, ఇతర ప్రాంతాలకు విస్తరించి.. ఉత్తర కొండహా, పూణె, బెంగళూరు, పుదుచ్చేరిలలో ప్రబలంగా ఉన్నాయి.
భారత వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవనాలు కొంకణ్, తెలంగాణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉన్నది. మరోవైపు ఉత్తర భారతానికి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ పేర్కొన్నది.
ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కోస్తా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి స్వల్పంగా బలహీనపడుతున్నదని ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.