అనకాపల్లి: అనకాపల్లి (Anakapalle) జిల్లా విజయరామరాజుపేటలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న ఓ లారీ అనకాపల్లి-విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి కింది నుంచి వెళ్లూ సేఫ్టీ గడ్డర్‌ను ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ (Railway Track) పక్కకు జరిగింది. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు వచ్చింది. అయితే ట్రాక్ పక్కకు జరిగిన విషయాన్ని గుర్తించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనతో విజయవాడ-విశాఖపట్నం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్‌నగర్, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను, ఎలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేశారు. కొంత సమయం తర్వాత మరో ట్రాక్ పైనుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు.
కాగా, అనకాపల్లిలో గతకొంతకాలంగా క్వారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నారు. పరిధికి మించి లారీల్లో రాయిని తరలిస్తుండగంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆదివారం ఓ క్వారీ లారీ ఎల్ఐసీ ఏజెంట్‌ను ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. ఓవర్‌లోడ్ కారణంగా గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవుతున్నాయి.