తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో( Tirumala ) పలువురికి టీటీడీ ఆంక్షలు ( Prohibitory orders ) విధించింది. ముఖ్యంగా యాచకులు, అనధికారిక వ్యాపారులను కొండపై నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ( Brahmotsavam ) నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని యాచకులు, అనధికార వ్యాపారులను తిరుమల నుంచి తరలిచేందుకు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి మురళీకృష్ణ , తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టీటీడీ విజిలెన్స్, హెల్త్ , శానిటేషన్ , తిరుమల పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి కొండ కింద తిరుపతికి పంపించారు. అనుమానితుల వేలిముద్రలు కూడా పరిశీలించారు. స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు, తిరుమలలో పని ముగించిన తర్వాత, తమ వద్ద పనిచేసే వారికి తగిన వసతిని తిరుపతిలో కల్పించాలని పోలీసులు సూచించారు. గత నెలలో కూడా ఇలాంటి డ్రైవ్లో 75 మందిని తరలించగా, ఇకపై కూడా నిరంతరం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.