అమరావతి: తన కులాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంపై టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలతో కలిసి ఆయన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రివిలేజ్ మోషన్ అందజేశారు. కులాన్ని ప్రస్తావించి మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యాలు ఏపీ అసెంబ్లీలో దుమారం రేపాయి. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని మంత్రి నాగార్జున వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆయనపై విరుచుకుపడి క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుబట్టారు.
తన పుట్టుక గురించి మంత్రి నాగార్జున అసెంబ్లీలో ప్రస్తావించారని, అసెంబ్లీలో అలా మాట్లాడటం ఏంటని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ప్రశ్నించారు. తన కులాన్ని ప్రస్తావించి ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. మంత్రి నాగార్జున చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల్లో లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఒకవేళ అలా మంత్రి మాట్లాడి ఉంటే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి మంత్రి నాగార్జునపై ప్రివిలేజ్ మోషన్ అందజేశారు. అంతకుముందు స్పీకర్‌కు మంత్రి నాగార్జునపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.
తాను కులాన్ని ప్రస్తావిచి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఆరోపణలు సత్యదూరాలన్నారు. తాను వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, దళితులను అవమానించిన టీడీపీ నేతలు మాకు నీతులు చెప్పడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని నాగార్జున చెప్పారు. స్పీకర్ గదిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి.. మంత్రి నాగార్జున అలా వ్యాఖ్యానించలేదని చెప్పబోయారు. దాంతో అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్ తదితరులు.. గతంలో లోకేశ్, చంద్రబాబుల గురించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చేయలేదా అన్ని ప్రశ్నించారు. వెంటనే మంత్రి క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.