అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడనున్న మంత్రివర్గంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ తాడెపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో దాదాపు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం చర్చల సారాంశాన్ని మీడియాకు వివరించారు. కేబినెట్లో మహిళలకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు.
పాత, కొత్త కలయికలో మంత్రి వర్గం కూర్పు జరుగుతుందన్నారు. కేబినెట్‌పై కసరత్తు రేపు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని వెల్లడించారు. మంత్రి వర్గంలో కొత్తవారిని చేర్చుకునేందుకు గల అన్ని అంశాలను జగన్ పరిశీలిస్తున్నారని వివరించారు. రేపు మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు. కాగా ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 11న ఉదయం 11.31 నిమిషాలకు నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయాన్ని ఖరారు చేశారు. ఇందుకు గాను ప్రముఖులకు, ఉన్నతాధికారులకు ఆహ్వాన పత్రికలను పంపించారు.