అమరావతి : ఏపీ ఉద్యోగుల పీఆర్సీతో పాటు దీర్ఘకాలిక ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు అన్నారు. జగన్ ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న తొలి దశ ఆందోళనలో భాగంగా శుక్రవారం విజయవాడలో సింహగర్జన పేరిట సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, సీఎంగా గెలిచి రెండున్నర ఏండ్లు గడుస్తున్న ఇంతవరకు సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదని, పీఆర్సీ ప్రకటన చేసినా ఉద్యమం విరమించం. రెండో దశ ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఈ నెల 13న అన్ని జిల్లాల్లోని తాలుకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతామని వారు పేర్కొన్నారు.