KA Paul | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైజాగ్లో దీక్ష చేపట్టిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. లాభాల్లో నడుస్తున్న ఉక్కు పరిశ్రమను.. తన మిత్రుడు అదానీకి చౌకగా కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రూ.8 లక్షల కోట్ల విలువైన పరిశ్రమను కేవలం రూ.4 వేల కోట్లకే కట్టబెట్టాలని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వమని చెప్పారు.
మోదీకి వత్తాసు పలుకుతున్న ఇక్కడి పార్టీల నేతలు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అవకాశమిస్తే లక్షల కోట్లు విరాళాలు తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని.. 10 లక్షల మంది నిరోద్యుగులకు ఉపాధి కల్పిస్తానని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గే దాకా తన దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.