KA Paul | రాజ్యసభ సభ్యుల ఎన్నికల ప్రక్రియ వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న నాగబాబు కొణిదెలకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి మంతనాలు చేశారని ఆరోపించారు.
గతంలో కేంద్రమంత్రి పదవి కోసం చిరంజీవి తన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని కేఏ పాల్ ఆరోపించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తన అన్నకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి కుటుంబానికి తమ స్వార్థం తప్ప మరేదీ పట్టదని వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కేఏ పాల్ సోమవారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. పవన్ కల్యాణ్ మంతనాలతో పాటు ఢిల్లీ కాలుష్యం, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కూడా ప్రస్తావించారు. ఢిల్లీలో కాలుష్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ పార్లమెంటు సమావేశాలను ఢిల్లీలోనే నిర్వహిస్తున్నారని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని సూచించారు. శీతాకాల సమావేశాలకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు. ఇక బంగ్లాదేశ్‌లో హిందువుల దాడిపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. భారత విదేశాంగ శాఖ మంత్రిని బంగ్లాదేశ్‌కు పంపించి చర్చలు జరపాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల దాడిపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌కు లేఖ కూడా రాశానని చెప్పుకొచ్చారు.