Garuda Seva | తిరుమలలో ఈ నెల 23న వైశాఖ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీవారి ఆలయంలో 22న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల వసంత మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. కార్యక్రమాన్ని వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని టీటీడీ తెలిపింది.