Pothula Sunitha | వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిన్న ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు రాజీనామా చేయగా.. ఇవాళ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీని వీడారు. బుధవారం నాడు వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు, శాసనమండలి కార్యదర్శికి లేఖ పంపించారు.
వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత ఏ పార్టీలో చేరబోతుందో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి తాను రాజీనామా మాత్రమే చేస్తున్నానని పోతుల సునీత తెలిపారు. ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే వైసీపీకి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పోతుల సునీత వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
పోతుల సునీత 2014లో టీడీపీ నుంచి చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆమెకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆమె వైసీపీలో చేరారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో కోల్పోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.