అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ కాగా ఇంకా భారీ సంఖ్యలో ఓటర్లు (Voters) బారులు తీరి ఉండడంతో పోలింగ్ శాతం 80 దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగగా పలు నియోజకవర్గాలు మినాహాయించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి .
రాష్ట్రవ్యాప్తంగా 4,14,01,897 మంది ఓటర్లుండగా, వీటిలో2,03,39,851 మంది పురుష ఓటర్లు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు, 3,421, థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణకు గాను 46,389 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి 1.6 లక్షల ఈవీఎం (EVM) లను వినియోగించారు. 34,165 చోట్ల వెబ్‌క్యాస్టింగ్(Webcosting) ను ఏర్పాటుచేసి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పోలింగ్ విధుల్లో 3.30 లక్షల మంది సిబ్బందిని నియమించి ఎన్నికలు నిర్వహించారు.
గత ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి 83 శాతం పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా 10 లక్షల యువ ఓటర్లు నమోదు కావడం పోలింగ్ శాతం పెరగడానికి కారణమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలింగ్ కేంద్రానికి ఆరుబయట వరకు ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. క్యూలైన్లో ఉన్న వారికి పోలింగ్ అధికారులు స్లిప్‌లు అందజేసి వారికే ఓటు హక్కును కల్పించనున్నారు.