Budameru | సోషల్‌మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం విజయవాడలో శనివారం కలకలం రేపింది. బుడమేరుకు మళ్లీ గండి పడిందని.. దీంతో బెజవాడకు భారీ వరద ముంపు పొంచి ఉందని నిన్న జోరుగా ప్రచారం జరిగింది. ఇది అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రికా ప్రాంత వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. దీంతో వారంతా ఇళ్లలో నుంచి బయటకొచ్చేశారు. ఈ ఫేక్ ప్రచారంతో నున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
సీఐ కృష్ణమోహన్ నేతృత్వంలోని పోలీసులు రంగంలోకి దిగారు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని మైక్ పట్టుకుని వీధులన్నీ తిరుగుతూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ ప్రచారం ఎవరు చేశారనే దాన్ని గుర్తించే పనిలో పడ్డారు. బుడమేరు కట్టపై పుకార్లను నమ్మవద్దని విజయవాడ కలెక్టర్ తెలిపారు. బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదని స్పష్టం చేశారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, బుడమేరుకు గండి పడిందని బైక్‌లపై కేకలు వేస్తూ ప్రచారం చేసిన కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బుడమేరు వరదలపై జరుగుతున్న వదంతులపై మంత్రి పి.నారాయణ స్పందించారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, బుడమేరు కట్ట తెగినట్టు, పుకార్లు సృష్టించి సైకో బ్యాచ్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని వైసీపీ మండిపడింది.