అమరావతి : కూటమి ప్రభుత్వం కుట్రతో ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) బలి కాబోతుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరానికి విఘాతం కలుగుతుందని, ఆ ప్రాజెక్టుకు ఉరి ఖాయమని అన్నారు.
గతంలో చంద్రబాబు (Chandra babu) పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్‌ను సరైన విధానంగా నిర్మించక పోలవరం పనులు పూర్తికాలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరాన్ని గాడిలో పెట్టామని పేర్కొన్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో పోలవరాన్ని పాతర వేయనున్నాడని ఆరోపించారు. పక్క రాష్ట్రాల ఒత్తిడితో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమని కేంద్రంతో ఒప్పందం చేసుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గంగలో కలుపనున్నారని విమర్శించారు. పోలవరానికి రూ. 12,157 కోట్లు కేంద్ర నిధుల విడుదలకు గత వైసీపీ ప్రభుత్వమే కారణమని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్ నిధులను డైవర్ట్ చేశారని ఆరోపించారు.