అమరావతి : చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్లే పోలవరం (Polavaram Project) ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఆరోపించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సోమవారం పోలవరాన్ని సందర్శించి ఆ ప్రాజెక్ట్ పూర్తికాకపోవడానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం కారణమని చేసిన ఆరోపణలపై అంబటి స్పందించారు.
2018నాటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం పోలవరంలోని కాపర్‌డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, నది డైవర్షన్ పనులు ఒకేసారి ప్రారంభించారని విమర్శించారు. వాస్తవానికి కాపర్ డ్యాం(Copper Dam) లు పూర్తి చేసి నదిని డైవర్షన్‌ను చేసిన పిదప డయాఫ్రమ్ వాల్ నిర్మిచాల్సిందని , అలా కాకుండా ఒకేసారి చేపట్టడం వల్ల ఏ పనులు కూడా పూర్తికాలేదని గుర్తు చేశారు.
వైసీపీ పాలనలో ప్రాజెక్టులను చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేశామని వెల్లడించారు. విమర్శలు పక్కనపెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో కూడా పోలవరం పూర్తికాదని చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారని గుర్తు చేశారు.