అమరావతి : ఏపీలో భారీవర్షాలు, వరదల వల్ల నష్టంపై వైఎస్ జగన్ (YS Jagan) తన పేటీఎం బ్యాచ్‌తో విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత (AP Minister Anitha) విమర్శించారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియా మాట్లాడుతూ గత తొమ్మిదిరోజులుగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జగదిగ్భందంలో చిక్కుకోగా ప్రభుత్వం, మంత్రులు నిద్రాహారాలు మాని ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు.
చంద్రబాబు(Chandra Babu) అనుక్షణం విపత్తుపై అప్రమత్తం చేస్తూ కాలనీల్లో పర్యటిస్తూ బాధితులను పరమార్శించారని గుర్తు చేశారు. బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించామని వివరించారు. అయితే వైసీపీ అధినేత జగన్ సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదని, బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారని ఆరోపించారు. పట్టుమని 20 నిమిషాలకు కూడా బాధితుల వద్ద గడపలేదని విమర్శించారు.
వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 27వేలకు పైగా ఇళ్లల్లో బురదను తొలగించామని, డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు క్లోరినేషన్ చేపట్టామని పేర్కొన్నారు. విజయవాడలో ఇంకా కొన్నిచోట్ల నీరు నిల్వ ఉందని, ఉదయం టిఫిన్లు, మంచినీరు, పాలప్యాకెట్లు సరఫరా చేశామన్నారు. రోజూ 170 వాటర్ ట్యాంకులు వందల ట్రిప్పుల ద్వారా మంచినీటిని అందిస్తున్నాయని స్పష్టం చేశారు. మంత్రి నిమ్మల మూడురోజుల పాటు బుడమేరు వద్దే కూర్చుని గండ్ల పనులను పూర్తి చేయించారని అన్నారు.