Anna Canteen | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతుందని కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటుంటే.. అసలు వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేదని చెప్పే వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేట్లను అపరిశుభ్రంగా ఉన్న నీటిలోనే కడుగుతుండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీనిపై వీడియో తీసిన వ్యక్తి అన్న క్యాంటీన్లో పనిచేసే వ్యక్తిని నిలదీసినప్పటికీ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంలో అందులో కనిపించింది. తణుకులోని అన్న క్యాంటీన్లో ఈ నెల 19వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. అన్నం పెడతామని పేద ప్రజలను అవమానిస్తున్నారా? గతిలేక తినడానికి వస్తున్నారని అవహేళన చేస్తారా అని నిలదీశారు. పేదలకు రూ.5కే భోజనం పెడుతుననామని ప్రచారం చేసుకుంటూ పచ్చ ప్రభుత్వం ఇంత దగుల్బాజీ పనిచేస్తుందని మండిపడ్డారు. పేదలకు పెట్టే తిండి, వారికి ఇచ్చే మర్యాద ఇదేనా? అని ప్రశ్నించారు. అందుకేనా అర ముక్క ఇడ్లీతో నారా లోకేశ్, చెంచా రైస్‌తో చంద్రబాబు నాయుడు తిన్నట్లు నాటకం ఆడిందని మండిపడ్డారు. పేదలంటే అంత చిన్నచూపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తణుకు అన్న క్యాంటీన్లో పరిశుభ్రతపై వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. భోజనాలకు ఉపయోగించే ప్లేట్లను మురికి నీటిలో కడుగుతున్నారనేది అవాస్తవమని తెలిపారు. భోజనం చేసిన తర్వాత వాష్బేసిన్లో పెట్టిన ప్లేట్లను బయటకు తీస్తున్న సమయంలో కొంతమంది వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు.
తణుకు అన్న క్యాంటీన్…
పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేట్లను అశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతూ భోజనానికి వచ్చిన పేదవాళ్లపట్ల కటువుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారు#AnnaCanteen #AndhraPradesh #Tanuku #TeluguDesam pic.twitter.com/eSFHC8BkSD
— Krishna Reddy (@TheDevireddy) August 26, 2024