Perni Nani | అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ విమర్శించారు. ఎన్టీఆర్, బసవ తారకమ్మ కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. బాలకృష్ణలాంటి వారి కోం అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్ పెట్టాలని అభిప్రాయపడ్డారు. తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడతారో తెలియదని విమర్శించారు. చిరంజీవిని కామినేని శ్రీనివాస్ ప్రశంసిస్తుంటే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడని ఆరోపించారు. సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవే అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సాయం చేయకపోతే బాలకృష్ణకు జీవితఖైదు పడేదని అన్నారు.
బాలయ్య అఖండ సినిమాకు సాయం చేయాలని ఆనాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ చెప్పారని పేర్ని నాని తెలిపారు. అఖండ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అప్పటి నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి ద్వారా బాలకృష్ణ తనకు ఫోన్ చేశారని.. అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలుస్తానని, సమయం ఇప్పించాలని కోరారని చెప్పారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్కు చెబితే.. బాలకృష్ణ నన్ను కలిస్తే ఆయనకే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని అన్నారని తెలిపారు. బాలకృష్ణ ఏది అడిగితే అది చేయాలని నన్ను జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. అదీ వైఎస్ జగన్ సంస్కారమని.. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన సంస్కారహీనానికి నిదర్శనమని స్పష్టంచేశారు. సొంత అన్నలా చిరంజీవిని వైఎస్ జగన్ చూసుకున్నారని పేర్కొన్నారు. ఆనాడే చిరంజీవి లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూతపడేదని అన్నారు.
గురువారం నాడు అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సినిమా నటులకు అవమానం జరిగిందని ఆరోపించారు. అప్పట్లో సినిమా నటుల్ని జగన్ తన ఇంటికి పిలిచి, తీరా వచ్చాక కలవనన్నారని, చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడొచ్చి కలిశారని కామినేని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. సినిమా నటులకు అవమానం జరిగిన మాట వాస్తవమే అని.. కానీ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చి కలిశారన్నది అబద్ధమని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట తూలారు.. ఎవడు గట్టిగా అడిగాడు అంటూ చిరంజీవిని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.