Perni Nani | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ నుంచి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.1750కోట్లు లంచం తీసుకున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆదానీతో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తోనే వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర విద్యుత్ కొనుగోలు చేస్తుందో తమకు అవసరం లేదని పేర్ని నాని అన్నారు. జగన్ కంటే ఏడాదిన్నర ముందు అదే సెకీతో చంద్రబాబు రకరకాల ధరలతో విద్యుత్‌ను కొనుగోలు చేశారని తెలిపారు. సెకీ నుంచి మిగత రాష్ట్రాల కంటే అధిక ధర వెచ్చించి ఎందుకు విద్యుత్ కొనుగోలు చేశారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పయితే దాన్ని కూడా రద్దు చేయాలని అన్నారు. గతంలో జగన్‌పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసిందని అన్నారు. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చిందని చెప్పారు. అలాంటప్పుడు జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుందని ప్రశ్నించారు.
ఈ అవినీతి కేసులో ఒకవేళ అదానీని అరెస్టు చేస్తే, ఆయనతో పాటు అప్పటి కేంద్ర మంత్రి, సెకీ చైర్మన్‌ను తీసుకెళ్తారని పేర్ని నాని అన్నారు. అందులో జగన్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవల్ అవినీతి చేశారని తెలిపారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్టు గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా ఉన్నందుకు రాష్ట్రానికి అప్పులే మిగిలాయని ఎద్దేవా చేశారు.