Perni Nani | వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వార్నింగ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు. వైఎస్ జగన్‌ను అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్ కల్యాణ్ ఎవరని ఆయన నిలదీశారు. 2019లో కూడా ఇలాగే అన్నారని.. మరి ఏమైందని ప్రశ్నించారు. ఈసారి కూడా అదే జరుగుతుందని తెలిపారు. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కల్యాణ్ కాదని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ జీవితమే సినిమా డైలాగులు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ అని.. చంద్రబాబుకు అద్దెకు ఇవ్వడానికే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కలుగులో నుంచి వస్తున్నారని అన్నారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సుగాలి ప్రీతి అదృశ్యం కేసును పవన్ కల్యాణ్ రాజకీయాల కోసం వాడుకుని, ఇప్పుడు వదిలేశారని పేర్ని నాని అన్నారు. అధికారంలోకి వచ్చాక కనీసం జనసేన కార్యకర్తలను కూడా పవన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. హెలికాప్టర్లో పిల్లల్ని తీసుకుని తిరగడం తప్ప పవన్ కల్యాణ్‌కు ఇంకేం తెలుసని ప్రశ్నించారు. తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన రూ.2800 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదడపం లేదని ప్రశ్నించారు. షిఫ్టులకొద్దీ రేషన్ బియ్యం బయటకు వెళ్తుంటే పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు? తిరుమలలో ప్రతిరోజూ అపచారాలు జరుగుతుంటే ఎందుకు పోరాటం చేయడంలేదు? ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగోలేవని అంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేశ్‌కు సిగ్గు లేదా అని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు.