Peddireddy Ramachandra Reddy | వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డితో శుక్రవారం నాడు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయలు కూడా అమలు కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే విషయానికి ఇది నిదర్శనమని తెలిపారు. గతంలో జైళ్ల వద్ద పోలీసుల ఆంక్షలు ఎలా ఉండేవో, ఇప్పుడెలా ఉన్నాయో ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. చంద్రబాబు సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. మితున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత బలంగా, సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేస్తారని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.