Buddha Venkanna | మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పుంగనూరుకే పరిమితం కాకుండా చిత్తూరు జిల్లా మొత్తం మీద పడి దోచేశారని విమర్శించారు. చంద్రగిరిని చెవిరెడ్డికి, తిరుపతిని భూమనకు, నగరిని రోజాకు వదిలి.. మిగతా ప్రాంతాలు మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నారని మండిపడ్డారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా వీరప్పన్‌గా పెద్దిరెడ్డికి నామకరణం చేస్తున్నామని ఎద్దేవా చేశారు.
పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపథం చేశారని అన్నారు. కానీ చంద్రబాబును ఓడించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారని విమర్శించారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలని కోరారు.
చిత్తూరు జిల్లా వీరప్పన్ అస్తులు మొత్తం అవినీతిమయమని.. కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలని బుద్ధా వెంకన్న అన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఒక కామన్‌మ్యాన్‌గా ఈ దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా.. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సీబీఐకి లేఖ రాసి వారి ఆస్తులను జప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సుజనా చౌదరితో విబేధాలపై కూడా బుద్ధా వెంకన్న స్పందించారు. సుజనాతో తనకు ఎటువంటి విభేదాలు లేవని.. కావాలనే ఎవరో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో తనకు అనుబంధం ఉందన్నారు. తనను టీడీపీ నగర అధ్యక్షుడిగా చేసింది కూడా సుజనా చౌదరే అని గుర్తుచేసుకున్నారు. ఆనాడు కేశినేని నాని వ్యతిరేకించినా.. సుజనా తనను ప్రోత్సహించారని చెప్పారు. మొన్న పోటీ చేసే ముందు తనకు ఫోన్ చేసి తన అభిప్రాయం కూడా అడిగారని అన్నారు. అటువంటి వ్యక్తితో తనకు విభేదాలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. తన జీవితంలో తను ఆయనతో ఎప్పుడూ గొడవ పడను అని స్పష్టం చేశారు.