అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాంధించింది. పార్టీని విజయపథాన నడిపిన జనసేనాని పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమాశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభా పక్షనేతగా పవన్‌కల్యాణ్ పేరును ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. దీనికి మిగిలిన ఎమ్మెల్యేలంగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కాగా, బుధవారం కొలువుదీరనున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో జనసేన భాగం కానున్నది. పొత్తులో భాగంగా పవన్‌కల్యాణ్‌తోపాటు పలువురికి మంత్రిపదవులు వరించనున్నాయి.
గత నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన 21 శాసనసభ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఇక పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది. దాదాపుగా అన్నిచోట్లా జనసేన అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏకంగా 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. భీమవరంలో ఆ పార్టీ అభ్యర్థి పులపర్తి అంజి 66 వేల మెజారిటీతో గెలిచారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ 48,112 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై విజయం సాధించారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ 62,492 ఓట్ల ఆధిక్యంతో వైసీపీపై గెలిచారు.