నెల్లూరు : ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట పార్కును నిర్మించారు. ఈ పార్కును నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. పార్కులో నెలకొల్పిన ఎస్పీబీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. నగరంలోని ఆదిత్య నగర్లో ఈ పార్కును పునరుద్ధరించారు. పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ ఓబులేసు నందన్, కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పేరిట పార్కును ప్రారంభించడం ఆయనకు మనమిచ్చే గౌరవమని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద్ అన్నారు. నెల్లూరు నగరానికి చెందిన వ్యక్తి కూడా కావడంతో బాలుకు నివాళిగా రూ.90 లక్షలతో పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజల మదిలో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు ఆయన పేరును ఈ పార్కుకు పెట్టినట్లు చెప్పారు.
ఈ పార్కులో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా కోసం ఒక గదిని నిర్మించారు. రూ.25 లక్షల అంచనా వ్యయంతో వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మాజీ మంత్రి అనిల్ తెలిపారు. నగరంలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో 19 పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ఆ పార్టీ నేతలు బయటపెట్టాలని, ఈ అంశంపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని అనిల్ చెప్పారు.