ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎవరైనా మూడు రోజులకు మించి స్కూల్కు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలో జిల్లా విద్యాధికారులు, అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు, అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో శనివారం జరిగిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ప్రకటన చేశారు.
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయరామరాజు సూచించారు. ఎంఈవోలు, సీఆర్పీలు, డీఈవోలు, ఏపీసీలు పాఠశాలలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు ఎవరైనా సెలవు పెడితే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలన్నారు. సెలవులు పెట్టకుండా విధులకు గైర్హాజరయ్యే వారి జాబితాను రూపొందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పదో తరగతిలో తక్కువ ఫలితాలు వచ్చిన సబ్జెక్టు టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు.
ఆప్షనల్ హాలీ డేస్ టీచర్లకే.. స్కూల్ మొత్తానికి కాదు!
ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ హాలీడేస్ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని విజయరామరాజు తెలిపారు. ఇవి పాఠశాల మొత్తానికి సెలవులు ఇచ్చేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేటు బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.