AP News | అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మదనపల్లి నవోదయ కాలనీకి చెందిన రెడ్డి ప్రవీణ్‌పై నాటు తుపాకీతో బావ దివాకర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు.. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో దివాకర్, అతని స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. మత్తు ఎక్కువ కావడంతో దివాకర్ అతని స్నేహితులతో గొడవ పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆనంద్ అనే వ్యక్తి ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఆవేశానికి లోనైన దివాకర్.. ఆనంద్‌తో వాగ్వాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో గొడవ మరింత ముదిరింది.
అదే సమయంలో అక్కడకు వచ్చిన దివాకర్ బావమరిది రెడ్డి ప్రవీణ్ ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ ఇరువర్గాలతో మాట్లాడుతుండగా దివాకర్ ఆగ్రహంతో ఇంటికి వెళ్లి ఓ నాటు తుపాకీని పట్టుకొచ్చాడు. వెంటనే ఆనంద్ వర్గంపై కాల్పులకు తెగబడ్డాడు. అయితే గురితప్పడంతో నాటు తుపాకీ రవ్వలు ప్రవీణ్‌కు తగిలాయి. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.