అమరావతి : విజయవాడలో భారీ వర్షాలు, వరదలకు ప్రకాశం బ్యారేజ్(Prakasam barrage ) వద్దకు కొట్టుకువచ్చిన 4 బోట్ల(Boats) తొలగింపు ప్రక్రియ అధికారులకు సవాలుగా మారింది. గత నాలుగురోజులుగా నిపుణుల సహాయంతో బోట్లను తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్టే వచ్చి మళ్లీ మొదటికి వస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
డైవింగ్ టీమ్(Diving team) తో బోట్లను రెండు ముక్కలు చేసి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.మరోవైపు ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో కాకినాడ అబ్బులు (Abbulu team) బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం సభ్యులు శుక్రవారం 7 భారీ పడవలను రంగంలోకి దించి మునిగిపోయిన బోట్లకు ఐరన్ రోప్‌లు, తాళ్లు కట్టి, వాటిని లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ పనుల్లో స్వల్ప పురోగతి మాత్రం కనిపించింది. 40 టన్నుల బరువు గల మిగతా బోట్లతో లంకెల వల్ల బోట్లు ముందుకు కదలడం లేదు.
మరో భారీ బోటు సాయంతో చిక్కుకున్న బోటును గేటు నుంచి 10 అడుగులు కదిలాక బోల్తాపడి ఇసుకలో చిక్కుకు పోయింది. క్రేన్లు, లిప్టులతో బోటును పైకి లేపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో శుక్రవారం సాయంత్రం బోట్ల తొలగింపు ప్రక్రియను నిలిపివేశారు. శనివారం బోటుకు బలమైన తాళ్లు, కొక్కేలు కట్టి బయటకు లాగాలని అధికారులు మరో ప్లాన్‌ను సిద్ధం చేశారు.