YS Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైసీపీ ఆరోపించింది. గుంటూరు సబ్ జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించి బయటకొచ్చిన జగన్‌తో సెల్ఫీ తీసుకున్న ఆయేషాభానుకి చార్జిమెమో ఇస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం అని ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనితపై మండిపడ్డారు.
టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం వెళ్లారు. నందిగం సురేశ్‌తో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే సమయంలో అదే జైలులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన కుమార్తెతో అక్కడకు వచ్చారు. జగన్‌కు తాను అభిమానిని అని, ఒక ఫొటో కావాలని అడిగారు. కుమార్తెతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అప్పుడు జగన్ కూడా నవ్వుతూ సెల్ఫీకి అనుమతినిచ్చారు.
ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో తాను మీ అభిమానిని అంటూ ఓ కానిస్టేబుల్ రావడంతో అంతా అవాక్కయ్యారు. ఈ విషయం కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఇలా వ్యవహరించడంతో మహిళా కానిస్టేబుల్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ఆయేషా బానుకు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.