అమరావతి : ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరుమార్పు బిల్లును వెనక్కితీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈమేరకు ఇవాళ రాజ్‌భవన్‌లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో చీకటి జీవో తీసుకొచ్చి ఎన్టీఆర్ వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ పేరుపెట్టడం అనాగరిక చర్యగా అభివర్ణించారు. ఎన్టీఆర్ ఆంధ్రప్రజలు ఆరాద్యదైవమని, నటుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. రాజకీయ, సినీరంగాల్లో ఎన్టీఆర్ ఒక క్రియేటర్‌గా నిలిచిపోయారని అన్నారు.
పేద ప్రజల భవిష్యత్ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్ వైద్యరంగానికి అనేక సేవలు చేశారని ఆయన హాయంలోనే 1986లో ఆరోగ్య వర్సిటీని ప్రారంభించారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలకు గాను తాను 1998లో ఆరోగ్యవర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టానని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఆంధ్రలో 32 మెడికల్ కళాశాలలు వచ్చాయని తెలిపారు.
అబద్దాల కోరు
అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. తాను రెండువేల కోట్ల రూపాయలతో ఎయిమ్స్ ను తీసుకొచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ పేరు మార్పు గురించి ఆత్మతో మాట్లాడడం కాదు తండ్రి వైఎస్సార్‌తో మాట్లాడినాడేమోనని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కంటే రాజశేఖర్‌రెడ్డి గొప్పవ్యక్తని చెప్పుకోవడానికైనా సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ఒక విశ్వ విద్యాలయానికి పేరు మార్చాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు.
విశ్వ విద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న గవర్నర్ అనుమతి తీసుకోకుండా జగన్ గవర్నర్ వ్యవస్థను కించపరిచే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. గడిచిన మూడేండ్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందించడం లేదని, మందులు అందడం లేదని ఆరోపించారు. జగన్ తీసుకున్న నిర్ణయం స్వయాన ఆయన చెల్లెలు షర్మిల తప్పుబట్టారని తెలిపారు. అవసరమైతే కళాశాలలు కట్టి పేర్లు పెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును తిరష్కరించాలని గవర్నర్‌ను కోరినట్లు చంద్రబాబు వివరించారు.