Whatsapp Governance | ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఈజీగా పనులు పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారంనాడు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు టికెట్లను కూడా వాట్సాప్‌లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది.
దూర ప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, బస్ డిపో మేనేజర్లకు సూచనలు చేసింది.
వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా ముందు 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపించాలి. అప్పుడు ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/రద్దు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత బయల్దేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటి వివరాలు అన్నింటిని ఎంటర్ చేయాలి. అప్పుడు ఏ బస్సులు, సీట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలను చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకుని, ఆన్లైన్, డిజిటిల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నంబర్‌కు టికెట్ వస్తుంది.