ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకూ రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల ముందు ఊదరగొట్టారని కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఆడపిల్లల మాన ప్రాణాలకు ష్యూరిటీ లేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించలేదని నిలదీశారు.
సీఎం సొంత జిల్లాలోనే మహిళలు శవాలై తేలుతున్నారని వరుదు కల్యాణి ఆరోపించారు. పుంగనూరులో అంజూమ్ అనే బాలిక హత్యకు గురైతే.. ఇంతవరకు దోషులను పట్టుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదని నిలదీశారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో చిత్తు కాగితానికి ఉన్న విలువ కూడా మహిళలకు లేదా అని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత నియోజకవర్గంలో మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు చేశారని అమ్మాయిలే ధర్నా చేస్తే కనీసం ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అక్కడకు వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలని కూడా హోంమంత్రి, డీజీపీ ప్రయత్నించలేదని మండిపడ్డారు. దీన్ని బట్టి ఆడపిల్లల మాన ప్రాణాల మీద కూటమి ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్య ధోరణి ఉన్నదో కనిపిస్తుందని విమర్శించారు. ఈ దారుణమైన ఘటనలు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆడ పిల్లల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించలేదని నిలదీశారు. ముచ్చుమర్రి, రాంబిల్లి, గుడ్లవల్లేరు ఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పుంగనూరు ఘటన జరిగినప్పుడు అయితే పవన్ కల్యాణ్ అదే జిల్లాలోని తిరుపతిలో ఉన్నారని గుర్తుచేశారు. పోలీసులకు డైరెక్షన్ ఇవ్వొచ్చు.. లేదా బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి భరోసా ఇవ్వొచ్చు కానీ అవేవీ చేయలేదని విమర్శించారు. ఆడపిల్లల మీద మీకు ఉన్న బాధ్యత ఇదేనా అని ప్రశ్నించారు. ఇది ఆడపిల్లలను అంతమొందించే ప్రభుత్వమని రాష్ట్రంలోని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు.