YS Sharmila | వైఎస్ షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. విశాఖపట్నంలో సోమవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన హడావుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ పర్యటన గబ్బర్ సింగ్ 3 సినిమాలా ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించడం చట్ట విరుద్ధమే అని అన్నారు. అధికారంలో ఉన్నది మీరే కదా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంప్రమైజ్ అయ్యావా? అని పవన్ కల్యాణ్ కాకినాడ ఎమ్మెల్యేను అడుగుతున్నారని.. పక్కనే ఉన్న మీ మంత్రి మాటేంటని నిలదీశారు. మంత్రి ప్రమేయం లేకుండానే పోర్టు నుంచి బియ్యం వెళ్తున్నాయా అని ప్రశ్నించారు. పోర్టులో నిజంగా అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెడ్డి, చౌదరి ఎవరైనా సరే తప్పు చేస్తే ఒకేలా స్పందించాలని సూచించారు.
బియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ అనుమతులు ఇప్పించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇది నిజమా కాదా అనేది బీజేపీ నేతలు గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించుకోవాలన్నారు. బియ్యం ఎగుమతికి అనుమతులు ఇప్పించలేదని.. బీజేపీ నాయకులు బహిరంగంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయింపులకు అసలు పొంతనే లేదని విమర్శించారు. హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని.. యూనిట్‌కు రూ.1.20 పెంచారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలపై త్వరలోనే తమ విధానం ప్రకటిస్తామని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.
కడపలో ఫ్లైయాష్ వివాదంపైనా బొత్స సత్యనారాయణ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వాటాల కోసం ఎమ్మెల్యేలు కొట్టుకోవడం ఏంటని విమర్శించారు. దాని పరిష్కారం కోసం సీఎం పంచాయితీ పెట్టడం ఏంటని అన్నారు. ప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలని.. ఏది లేకపోతే ఎలా అని విమర్శించారు.