Anna Canteen | కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది. రూ.5కే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటివారితో, సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని అన్న క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
రూ.5కే భోజనం లభిస్తుండటంతో చాలామంది నిరుపేదలు అన్న క్యాంటీన్లపై ఆధారపడుతున్నారు. అయితే కొంతమంది తాగుబోతులు కూడా అన్న క్యాంటీన్లకే వస్తున్నారు. వచ్చిన వాళ్లు కామ్‌గా భోజనం చేసి వెళ్లకుండా.. సిబ్బంది, ఇతర కస్టమర్లతో గొడవలకు దిగుతున్నారు. ఫూటుగా మద్యం తాగి వచ్చి ఇంకా అన్నం వేయాలి.. కూరలు వేయాలంటూ సిబ్బందిని డిమాండ్ చేయడంతో పాటు గొడవలకు దిగుతున్నారు. దీంతో వీరిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థంగాక క్యాంటీన్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చారు.
మద్యం తాగి వచ్చిన వారికి అన్న క్యాంటీన్లలో టోకెన్ ఇచ్చేది లేదంటూ బయట హెచ్చరిక బోర్డులు పెట్టారు. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్న వాళ్లు హోటల్‌కే వెళ్లి తినాలని, రూ.5కే భోజనం అనేది కేవలం నిరుపేదలకు మాత్రమేనని నిర్వాహకులు చెబుతున్నారు.
Anna Canteen