అమరావతి : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు పథకంలో అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. తాడెపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న శాశ్వత భూ హక్కు పథకంపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించ నిర్వహించారు. భూ రికార్డులను మార్చలేని విధంగా, ట్యాంపర్ చేయలేని విధంగా రిజిస్ట్రర్లు చేపట్టాలని సూచించారు.
ఎలక్ట్రానిక్‌తో పాటు ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలని, ఫిజికల్ డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆయన సూచించారు. గతంలో వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని అన్నారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని, ఈ విషయంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని, భూ సర్వే, రికార్డుల అంశాల్లో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం నిలచే పనులు చేపట్టాలని జగన్ సూచించారు.