AP News | పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ ఏపీలో కలకలం రేపుతోంది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఎంపీడీవో.. ఈ రోజు నా పుట్టిన రోజు.. ఇదే నా చావు రోజు అంటూ తన కుమారుడికి చివరిసారిగా మెసేజ్ పెట్టడంతో ఆందోళన నెలకొంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ ఆచూకీ మాత్రం దొరకడం లేదు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో మండవ వెంకట రమణరావు నివాసం ఉంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి సెలవు పెట్టిన ఆయన.. ఇటీవల కానూరులోని ఇంటికి వచ్చారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని.. ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పాడు.
అర్ధరాత్రి దాటాక కుమారుడికి ఒక మెసేజ్ చేశాడు. నా పుట్టిన రోజైన 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త అని మెసేజ్ చేశాడు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంపీడీవో కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. మచిలీపట్నం రైలు ఎక్కిన ఎంపీడీవో రమణారావు మధురానగర్లో దిగినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఏలూరు కెనాల్లో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మధురానగర్ దగ్గర కెనాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.