Nara Lokesh | ఏపీ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స వ్యాఖ్యానించడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తల్లిని నిండుసభలో అవమానించినప్పుడు ఈ విషయం మీకు గుర్తుకురాలేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీసీ నేతలకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.
మా మహిళలపై కేసులు పెట్టారు కదా.. అప్పుడు మీరేం చేశారని బొత్స సత్యనారాయణను నారా లోకేశ్ నిలదీశారు. మా తల్లిని నిండుసభలో అవమానించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఒక తల్లిపడే ఆవేదన, బాధ తనకు తెలుసని అన్నారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఏంటో నేను ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు. మా తల్లిని అవమానిస్తే ఆమె కోలుకోవడానికి రెండు నెలలు పట్టిందని చెప్పారు. తల్లిని అవమానించిన వాళ్లు ఇవాళ గౌరవం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు.
నారా లోకేశ్ మాటలకు బొత్స సత్యనారాయణ స్పందించారు. తల్లిని అవమానించడాన్ని తాను సమర్థించనని చెప్పారు. ఇప్పుడే కాదు.. ఆనాడు కూడా తాను ఇదే మాట మీద ఉన్నానని చెప్పారు. కానీ అప్పటి సందర్భాన్ని టీడీపీ నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కాగా, బొత్స చేసిన ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. తల్లి పడే బాధను చూసి లోకేశ్ ఆవేదన చెందారని తెలిపారు. అప్పుడు ఆ తల్లి పడిన బాధను మేం కూడా ప్రత్యక్షంగా చూశామని అన్నారు. అలాంటిది రాజకీయా కోసం మాట్లాడుతున్నారని బొత్స ఎలా అంటారని ఆమె మండిపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్చేశారు.