Nara Lokesh | శాసనసభకు రావాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తీసుకురావాలి కదా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే పార్టీ వైసీపీ అని విమర్శించారు. వైసీపీ చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జగన్ ఎక్కడికైనా వెళ్లొచ్చు.. హౌస్ అరెస్టులు ఏమీ ఉండవని నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. పెట్టుబడుదారులను భయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు ఈ వారమంతా బిజీ షెడ్యూల్ ఉందని తెలిపారు. ఎక్కువగా తిరగడం మంచిది కాదని చెప్పినా ఆయన వినడం లేదన్నారు.
ఇక ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో వచ్చేస్తుందని నారా లోకేశ్ తెలిపారు. అక్టోబర్ నుంచి వరుస పెట్టుబడులు తెచ్చేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి పెట్టబడులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నిర్విరామ కృషి జరుగుతోందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
జీఎస్టీపై అక్టోబర్లో వరుస కార్యక్రమాలు చేపడతామని నారా లోకేశ్ తెలిపారు. 50 వేల కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందని పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 19 నాటికి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు.