Nara Bhuvaneswari | ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఇందుకోసం ఆమె శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ తీసుకుని ఆమె తుమ్మిసి వరకు వెళ్లారు. ఈ సందర్భంగా బస్సులోని మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. జలహారతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు. కృష్ణా జలాలను కుప్పం తీసుకొచ్చి తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించిన చంద్రబాబు కృషి అభినందనీయమని కొనియాడారు. కుప్పంలో 23 వేల కోట్ల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలు ఏర్పాటు చేశారని, అందులో మూడింటిని మహిళల అభివృద్ధికి కేటాయిచారని గుర్తుచేశారు. దీనివల్ల ఈ ప్రాంతానికి కొత్త అవకాశాలు తెచ్చిందని అన్నారు. చంద్రబాబుకు కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సామగుట్టపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విలువల బడి కార్యక్రమాన్ని గురువారం నాడు ప్రారంభించారు. పరమసముద్రం కేజీబీవీలో పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పర్యటన ముగించుకుని వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఉన్న ఓ షాపు వద్ద టీ తాగి, బిస్కెట్ తిన్నారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న కొంతమందితో సరదాగా మాట్లాడారు.