హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ఏడు మండలాలను ఇస్తేనే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం వల్లనే.. 2014లో మోదీ ప్రభుత్వం వాటిని ఏపీలో విలీనం చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంగళవారం అమరావతిలో నిర్వహించిన టీడీపీఎల్పీ సమావేశంలో ఆనాటి కుట్ర కోణాన్ని బయటపెట్టారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను, ప్రధానిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. అయితే, నాడు పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి ఇస్తే తప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోనని స్పష్టంచేశానని తెలిపారు. దీంతో మోదీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ మీటింగ్‌లోనే ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నదని, ఆర్డినెన్స్ జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటి మాదిరిగానే పదేండ్ల క్రితం 2014లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చారు.
నాడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యపక్షంగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీయే ప్రభుత్వం 2014 జూలై 11న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకణ చట్ట సవరణకు ఆర్డినెన్స్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టి, తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ల పరధిలోని ఏడు మండలాలను ఏపీకి ధారాదత్తం చేసింది. ఈ చర్యను నాడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాడు తెలంగాణ ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమండలాలను తిరిగి ఇవ్వాలని నాటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా, పట్టించుకున్న పా పాన పోలేదు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
ఏడు మండలాల విలీనం విషయంలో కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ కలిసి చేసిన కుట్రను చంద్రబాబు స్వయంగా బయట పెట్టినప్పటికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం కానీ, ఆ పార్టీ నేతలు గానీ నోరు విప్పక పోవ డం గమనార్హం. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన ఏపీ టీడీపీ ప్రభుత్వం చేయబోయే ప్రమాణ స్వీకారానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్ద వెళ్తా రా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్డీ యేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా మరెన్ని కుట్రలు చేస్తారోనన్న ఆందోళన తెలంగాణవాదుల్లో వ్యక్తమవుతున్నది.
‘రాష్ర్టానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. నేను 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ అనుమతి ఉంటే తప్ప, పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప పోలవరం కట్టే పరిస్థితి లేదు. ఆరోజు రాజ్‌నాథ్‌సింగ్ బీజేపీ అధ్యక్షుడు, వెంకయ్యనాయుడు కూడా అప్పుడు యాక్టివ్‌గా ఉన్నారు. ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదు. ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. నాకీ పదవి వద్దు అని స్పష్టంగా చెప్పాను. ఆ రోజు ప్రధాని నరేంద్రమోదీ ఇవన్నీ ఆలోచించి, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్‌లో పెట్టి, ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చి, ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అదొక చరిత్ర’.
– చంద్రబాబునాయుడు (అమరావతి ఏ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన టీడీపీఎల్పీ సమావేశంలో)