
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు మధు తీవ్రంగా ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ పోరాటంలో భాగస్వాములు కావాలని సూచించారు. గురువారం అమరావతిలోని తాడెపల్లిలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర మహాసభలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం రాష్ట్రానికి అంతా చేశామని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. బీజేపీ అజెండాను వైసీపీ అమలు చేస్తోందని దుయ్యబట్టారు. ‘ కడప ఉక్కు కర్మాగారానికి దిక్కు లేదు ..విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ’ అమ్ముతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చీపు లిక్కర్ రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ నాయకులపై విమర్శలు చేశారు. సహకార డెయిరీలు మూసేసి ఎవరికోసం అమూల్ తీసుకొచ్చారని ప్రశ్నించారు. ‘ అమూల్ సహకారం తీసుకోండి..కానీ సహకార డెయిరీలను మూయవద్దని’ , రైతులకు లీటర్‌పై రూ.4 అదనంగా ఇస్తామన్న సీఎం జగన్ మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.వామపక్ష పార్టీలను కలుపుకొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా తయారవుతామని వెల్లడించారు.