అమరావతి : ముంబై నటి కాదంబరి జత్వాని(Jatwani) కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని ఏపీ డీజీపీ (AP DGP) ద్వారకా తిరుమలరావు(Dwaraka Tirumala Rao) తెలిపారు. నివేదిక వచ్చిన తరువాత కేసులో భాగస్వామ్యమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏలూరులో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జత్వాని కేసులోప్రాథమిక విచారణ అనంతరం పోలీసుల అధికారులపై (Police Officers) చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఐఏఎస్ అధికారుల(IAS) పై చర్యలు తీసుకోవడానికి ఉన్న చట్టలను పరిగణనలోకి తీసుకుంటామని, అదేవిధంగా అధికారుల వివరణను సైతం తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టామని, పోలీస్ క్యాంటీన్లకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ. 4.7 కోట్లు ఇచ్చామని తెలిపారు. పోలీసులు ధైర్యంగా పనిచేసేలా సంసిద్ధం చేస్తున్నామని, ప్రజలకు జవాబుదారిగా పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. పెండింగ్లో ఉన్న పోలీసు స్టేషన్ల భవనాలను త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.
పోలీసు వాహనాల కొనుగోలు, పీఎస్లల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు సిగ్గుచేటని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అవగాహన సదస్సుల ద్వారా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.