శ్రీశైలం : ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi ) సందర్భంగా శుక్రవారం శ్రీశైలంలో (Srisailam) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు తెల్లవారుజాము 3.30 గంటల నుంచి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి మంగళవాయిద్యాల మధ్య ఆలయ ద్వారాలను తెరిచారు. అనంతరం మహా మంగళ హారతులు నిర్వహించారు.
ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం (Uttara Dwaram) నుంచి తీసుకొచ్చి రావణవాహనంపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ప్రతియేట రెండుసార్లు ముక్కోటి ఏకాదశి, శివముక్కోటి రోజున మాత్రమే స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామోత్సవంలో కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ప్రధానార్చకులు కె శివప్రసాద్స్వామి తదితరులు పాల్గొన్నారు.