Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరవంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు స్వామి అమ్మవార్లకు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశామని ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో సాయంకాల అర్చనలు, హోమాలు జరిపిన తర్వాత స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మయూర వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు. మయూర వాహనంపై ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇచ్చారు.
మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతోపాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. ఉత్సవ మూర్తులను గంగాధర మండపం నుండి నంది మండపం మీదుగా బయలువీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం కన్నులపండువగా ఊరేగింపు సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
సమస్థ సృష్టి క్రియా చైతన్యానికి ప్రతీకైన మయూరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శివుడి వాహనంగా మారడానికి ఇద్దరిలోనూ ఉన్నది శివాంశేనని విశ్వసించే భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మెక్కులు చెల్లించుకున్నారు. గ్రామోత్సవం అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. గ్రామోత్సవంలో అసిస్టెంట్ కమీషనర్ వెంకటేశ్, ఈఈ రామకృష్ణ, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీందర్ ప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి కన్నులతో కనిపెట్టుకునే ప్రత్యేక గుణం కలిగిన నెమలివలె మయూర వాహనంపై ఉన్న ఆదిదంపతులను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఉభయ దేవాలయాల్లో షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులతోపాటు ఉత్తర దక్షిణాది రాష్ట్రాల భక్తులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి టీటీడీతోపాటు కాణిపాక శ్రీ వరసిద్ది వినాయక దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం కాణిపాక దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్‌లకు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా శ్రీశైలం ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు విజయలక్ష్మి సుబ్బరాయుడు, అర్చక వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సాయంత్రం టీటీడీ తరపున ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు జేఈవో జే వీరభ్రహ్మం దంపతులు, వేదపండితులు, అధికారులు.. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలని శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న సూచించారు. భక్తులకు సేవలందించాలని పేర్కొన్నారు. మంగళవారం క్షేత్ర పరిధిలో పాతాళగంగ స్నాన ఘాట్లు, తాత్కాలిక దవాఖాన ఏర్పాట్లు, కేశ ఖండన శాల, లడ్డూ తయారీ కేంద్రం-విక్రయశాల, క్యూ లైన్లు, టిక్కెట్ కౌంటర్లు, టోల్గేట్ టికెటింగ్ విధానాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రధానంగా అన్నదాన భవనంలో నిత్యం యాత్రికులతోపాటు శివసేవకులు, కళాకారులు, ప్రత్యేక విధులు నిర్వహించే సిబ్బందికి అందించే అల్పాహార భోజనాలు తాజాగా రుచికరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రెడ్డివారి చక్రపాణిరెడ్డి సూచించారు.