అమరావతి : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(Andhra Cricket Association ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ( శివనాథ్ ) ఏకగ్రీవంతో పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెప్టెంబర్ 8న ఏసీఏకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా నిన్న శుక్రవారం ఎన్నికల (Elections) నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఏసీఏలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్(Kesineni Shivnath), ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ , కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణు కుమార్రాజు, కోశాధికారిగా శ్రీనివాస్. కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. అయితే తుది ఫలితాలను వచ్చే నెల 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
వైసీపీ ఐదేండ్ల పాలనలో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కుటుంబ సభ్యులు చేజిక్కించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏసీఏకు ఎన్నికలు నిర్వహించారు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికలను సవాలుగా తీసుకుని మొత్తం కార్యవర్గం ఏకగ్రీవం కావడంలో సఫలికృతమయ్యారు.