తిరుపతి : తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వసతులు, వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు, శస్త్ర చికిత్సలను ఆమె పరిశీలించారు. ఆసుపత్రి ముందు, వెనుక ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను సూచించారు.
అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్స్ రే, స్కానింగ్, ఓపి వార్డులను ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్న ప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పాత బ్లాక్ వద్ద ఖాళీ స్థలంలో రోగులు వారి సహాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి డీపీడబ్ల్యూస్టోర్ కు తరలించాలని ఆదేశించారు.
కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు వారికి చేసిన వివిధ రకాలపరీక్షలు, అందించిన వైద్యం లాంటి మొత్తం వివరాలు కంప్యూటరైజ్ చేయాలన్నారు. ఆమె వెంట ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, సీఎస్ఆర్ ఎంవో డాక్టర్ కిషోర్, ఈ ఈ కృష్ణారెడ్డి, డీఈ సరస్వతి పాల్గొన్నారు.