ఒంగోలు జిల్లా : స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. మంచి మార్కులు సాధించి ఆర్థిక సమస్యలతో ఇంటర్ చదువును నిలిపివేసిన బాలికకు అండగా నిలిచాడు. అమ్మాయి సమస్యను తెలుసుకుని అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి ఓ కాలేజీలో సీటు ఇప్పించారు. ఆ చిన్నారి చదువుకయ్యే ఖర్చును భరిస్తానంటూ హామీ ఇచ్చారు. వివరాల్లోకెళితే..
గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరంలోని 49 వ డివిజన్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురంలో ఓ నిరుపేద విద్యార్థిని దైవాల నందిని మొన్నటి పదో తరగతి ఫలితాల్లో 553 మార్కులు సాధించింది. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇంటర్ చదవడం ఆమెకు ఇబ్బందిగా మారింది. తన చదువుకు డబ్బు లేకపోయిందని తెలిసిన వారి వద్ద ఆమె మొరపెట్టుకున్నది. ప్రైవేటు కాలేజీలో ఫీజు కట్టే స్థోమత లేక బాలిక పైచదువులకు వెళ్లలేకపోతున్నట్లు బాలినేనికి తెలిసింది.
వెంటనే ఆ బాలికను తన వద్దకు పిలుపించుకుని చదువుకుంటావా? అని అడిగిన ఎమ్మెల్యే.. అప్పటికప్పుడు ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఆ అమ్మాయికి సీటు ఇప్పించాడు. ఆ బాలకి చదువుకయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని బాలినేని స్వయంగా ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే బాలినేని పెద్ద మనసు పట్ల సత్యనారాయణపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.