అమరావతి : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్థాపించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై (Visakha Steel Plant) శాసన మండలిలో (AP Council ) గురువారం వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) , అచ్చెన్నాయుడు, తదితరులు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు.
ప్లాంట్ నిర్వహణలో పలు లోపాలున్నాయని పేర్కొన్నారు. నిర్వహణకు పెట్టుబడులు, కార్మికుల పని సామర్ద్యం పెంపు తదితల సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్మిక సంఘాల నాయకులతోనూ పలు దఫాలుగా చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharat) మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకర చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. టాటా భాగస్వామ్యంతో వ్యాపార అభివృద్ధి చేసే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలోనూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చిందన్నారు.
మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళనలు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని సీఎం కోరారని, కేంద్ర మంత్రి వచ్చి కార్మికులతో చర్చించి ప్రైవేటీకరణ లేదని చెప్పారని గుర్తు చేశారు.
వైసీపీ నాయకుడు , మండలిలో ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగదని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారని వెల్లడించారు.